When Jesus ascended up on high, He led captivity captive. (Ephesians 4:8)
- paradise ecstasy
- Oct 30, 2024
- 4 min read

ఆయన (యేసు) ఆరోహణమైనప్పుడు, చెరనుచెరగాపట్టుకొనిపోయెను
(ఎఫెసీయులకు 4:8)
Be Men in Understanding the Holy Doctrine
దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?
సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?
(యోబు 11:6-7)
పరిశుద్ధ లేఖనములలో పాతాళమును, మృతుల లోకముగాను (ఆదికాండము 37:35, 42:38, 44:29, 44:31, ప్రకటన గ్రంథం 20:14), ఆత్మల లోకముగాను, పాతాళ లోకముగాను (ప్రకటన గ్రంథం 6:8, 20:13) చెప్పబడియునది. ఈ పాతాళము భూమి క్రింది దిగువ భాగమున వున్నది (యెహేజ్కేలు 26:19, 32:18, సామెతలు 15:24). మరణించిన ప్రతివాడును పాతాళమునకు వెళ్ళవలసి యున్నది. కీర్తనలు 89:48 లో మనము గమనించినట్లైతే - మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించు కొనగలవాడెవడు? మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను (రోమీయులకు 5:12). ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము (రోమీయులకు 6:23). పాతనిబంధన కాలమునుండి యేసుక్రీస్తు కాలము వరకు మరణించిన ప్రతివారు పాతాళమునకు వెళ్లారు. అయితే మరణించిన దేవుని భక్తులు / నీతిమంతులందరు భూమి క్రింది దిగువున ఉన్న పాతాళములో ఒక భాగమైన మరణము అను 'చెర' కు కొనిపోబడియున్నారు. ఈ చోటుని 'అబ్రాహాము రొమ్ము' అని కూడా పిలువబడినది (లూకా 16:22). యేసు విమోచించు కాలము వరకు ఈ చెర, మరణించిన నీతిమంతులకు నెమ్మదిని ఇచ్చు చోటుగా చెప్పబడినది (లూకా 16:25). మరణించినవారు భూమి దిగువభాగమున ఉన్నపాతాళమునకు వెళ్లియున్నారు అను ఈ విషయముని రూఢీపరచుటకు మనము 1సమూయేలు 28:13 లో చూచినట్లైతే - దేవతలలో ఒకడు (సమూయేలు) భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను. మత్తయి 27:51-52 లో చూచినట్లైతే, భూమి వణకెను; బండలు బద్దలాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. మరియు లూకా 16 :22 -26 లో (ధనవంతుడు - లాజరు - అబ్రాహాము విషయములో) చూడగలము. అదేవిధంగా భక్తిహీనులు / పాపాత్ములందరు, యాతన పడు చోటికి అనగా పాతాళమునకు (నరకములో ఒక భాగము - యెషయా 14:15 ) వెళ్లారు. ఈ విషయమును మనము లూకా సువార్త 16:25 లో చూడగలము - ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. పాతాళమునకును, చెర కును మధ్య మహా అగాధముంచబడియున్నది (లూకా 16:26). మనిషి మరణించిన ఒక క్షణములోనే మనిషి ఆత్మ పాతాళమునకు పోవును - యోబు 21:13. పాతాళమునకు పోయిన వారు మరి ఎన్నటికిని తిరిగి రారు - యోబు 7:9).
మరణించిన దేవుని భక్తులు పాతాళము లో ఉన్న చెర లోనికి ఎందుకు వెళ్లారు?
మరణించిన దేవుని భక్తులు / నీతిమంతులు పాతాళము లో ఉన్న చెర లోనికి ఎందుకు వెళ్లేవారంటే, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములు నుండి వారు విడిపింపబడలేదు. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన (యేసు) మరణము పొందెను (హెబ్రీయులు 9 :15). జంతువుల యొక్క రక్తము కేవలం మనిషి యొక్క పాపములను కప్పును కానీ వాని పాపములను తీసి వేయలేదు. ఏలయనగా ఎడ్లయొక్కయు, మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము (హెబ్రీయులు 10 :4). అయితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును - 1యోహాను 1:7. పాతనిబంధన కాలమందు ఇవ్వబడిన ధర్మ శాస్త్రము, విశ్వాససంబంధమైనది కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవరును నీతిమంతులుగా తీర్చబడరు (గలతియులకు 2:15). నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు యేసు చనిపోయినది నిష్ప్రయోజనమే (గలతియులకు 2:21). కావున, మొదటి నిబంధన కాలంలో మరణించిన దేవుని భక్తులు / నీతిమంతులు, పాపక్షమాపణ పొందకయున్నారు గనుక వారిని పాతాళం చెరగా పట్టుకుని ఉన్నది. ఈ విషయముని మనము యోబు 24:19 లో చూడగలము - అనావృష్టిచేతను, ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును. ఈ హేతువు చేత, పాతనిబంధన కాలమందు ఇవ్వబడిన ధర్మ శాస్త్రం వలన ఎవరు నీతిమంతులు కాలేరు. ధర్మ శాస్త్రము క్రింద ఉన్నవారి కోసం కూడా యేసు క్రీస్తు వారు రక్తము చిందించాలి. అందుకే, యేసు క్రీస్తు వారు రూపాంతర బండ యొద్ద ప్రార్ధన చేస్తున్నప్పుడు, మోషే, ఏలియాలు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడిరి. లూకా 9:30 -31. యెరూషలేములో ఏమి నెరవేర్చబోవుచున్నారు అంటే యేసు సిలువ మరణము. అయన మరణము ద్వారా నిర్గమము జరగబోతుంది. నిర్గమము అంటే బయటకు వచ్చుట లేదా విడుదల పొందుట అని అర్థము. అందుకే మోషే, ఏలియాలు మహిమతో అగపడి పాతాళ చెర, లో వున్నవారి నిర్గమమును గూర్చి మాటలాడి వుండవచునని బైబిలు పండితులు / విశ్లేషకులు అభిప్రాయపడిరి. దీనిని బట్టి యేసు క్రీస్తు వారు భూమిమీద ఉన్న సమస్త మానవాళికొరకు (అనగా పాతనిబంధన మరియు కొత్తనిబంధన కాలములో ఉన్నవారందరికొరకు) మరణించెనని గ్రహించగలము. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు (హెబ్రీయులకు 9:15 ).
యేసు మరణమైన తరువాత పాతాళమునకు వెళ్ళారా?
యేసు మరణమైన పిమ్మట, తాను పాతాళమునకు వెళ్లినట్లు మనము (మత్తయి 12:40 లో మరియు అపో.కార్యములు 2:31 లో చూడగలము, యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును (మత్తయి 12:40) మరియు యేసు క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను (అపో.కార్యములు 2:31). కావున, యేసు క్రీస్తు బలియాగము ద్వారా పాతాళములో చెర గా ఉన్న భక్తులను / నీతిమంతులను విడిపించి, అయన ఆరోహణమయినప్పుడు వారిని చెరను చెరగా పట్టుకొనిపోయారు - ఎఫెసీయులకు 4:8. ఇక్కడ చెర అంటే ధర్మశాస్త్రము కాదు, చెర అంటే పట్టబడిన వారు అని అర్థము. ఈ విషయాన్ని మనము కీర్తనలు 68 :18 లో చూడగలము - నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి, ఎఫెసీయులకు 4:9-10 లో చూచినట్లైతే, ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు. కావున ఆ చెర లో ఉన్నదేవుని భక్తులు / నీతిమంతులు, పాతాళములో నుండి విడిపింపబడి, మూడవ ఆకాశము పైనున్న పరదైసునకు కొనిపోబడియున్నారు (2కోరింథీ12:2 -3) అని గ్రహించగలము.
ఇప్పుడు మరణించిన నీతిమంతులు, భక్తిహీనులు ఎక్కడికి వెళ్తారు?
ఇప్పుడు (కొత్తనిబంధన కాలమందు) మరణించిన భక్తిహీనులు / పాపాత్ములందరు, తీర్పుదినమువరకు పాతాళమునకు వెళ్తారు, ఈ విషయముని మనము 2 పేతురు 2 :9 -10 లో చూడగలము దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. అదేవిధంగా మరణించిన నీతిమంతులు / విశ్వాసులు, అందరూ మూడవ ఆకాశము పైనున్న పరదైసుకి వెళ్తారు అని గ్రహించగలము (లూకా సువార్త 23:43, అపో.కార్యములు 2:27). పరిశుద్ధ గ్రంధములో, పైన ఉన్న ఆకాశము తెరవబడుట ఈ ముగ్గురు భక్తులు చూసారు, అపో.కార్యములు 7:56 లో స్తెఫను, 2కోరింథీ12:2 లో పౌలు మరియు అపో.కార్యములు 10:11 లో పేతురు. భూమి క్రింద ఉన్న దిగువ భాగానికి వస్తే, ఈ చెర స్థలము కాళీ అయ్యి, ప్రకటన గ్రంథం 20:2-3 &13 -14 వచనముల ప్రకారం, మృతుల లోకము, చెర రెండు కలిసిపోయాయి. దీని లోనే అపవాదియు, సాతానును అను ఆ ఘటసర్పమును దేవుడు బంధించబోవుచున్నాడు. ప్రాముఖ్యమైన విషయం గమనించాలసింది ఏమిటంటే, పరదైసు, పరలోకము కాదు. పరదైసు, జీవవృక్షఫలములు కలిగిన ప్రదేశము (ప్రకటన గ్రంథం 2:7) మరియు నీతిమంతులకు నెమ్మది నిచ్చు స్థలము మాత్రమే, కానీ పరలోకము నీతిమంతుల వాగ్దానఫలము. నీతిమంతులు పరలోకము వెళ్ళకుండా పరదైసు కి ఎందుకు వెళ్తునారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:39 -40 లో ఈ విధముగా చెప్పబడినది, వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధ పరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు. ఈ హేతువు చేత, అందరూ తీర్పు అయిన పిమ్మట పరలోకము వెళ్ళవలసియున్నది అంతవరకు వారు వారి స్థలంలో ఉండాలని దేవుని ఉదేశము. అందుకే యేసు క్రీస్తు వారు ఈ విధముగా చెప్పినారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు (యోహాను 14:6).
దేవుని ఆత్మచే ప్రేరేపింపబడి , వ్రాయింపబడిన ఈ విషయములను జాగ్రత్తగా పరిశీలించి, మన ఆత్మల తుది గమ్యస్థలముల విషయమై మెళుకువగలిగి, అన్ని విషయముల యందు యధార్ధతతో, సత్ప్రవర్తన తో, కృతజ్ఞత తో ఆత్మ ఫలములు కలిగి, దేవునికి ఇష్టులుగా జీవించి, ఆ సీయోను పురమును చేరాలని మా హృదయాభిలాష, మేము దేవునికి చేయు ప్రార్ధన.
Bro. Bandi S Herold.
Watch this in video (click on the link given)







Comments